ఎమ్మెల్యేల రాజీనామాతో మైనారిటీలో పడిపోయిన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి గురువారం నుంచి బలపరీక్షను వాయిదా వేయిస్తూ నెట్టుకొస్తున్నకర్ణాటక సీఎం కుమారస్వామి బలపరీక్షకు మరో రెండు రోజులు గడువు ఇవ్వాల్సిందిగా సభాపతి రమేశ్‌కుమార్‌ను కోరినట్లు తెలుస్తోంది.సోమవారం ఉదయం సమావేశాల ప్రారంభమవడానికి ముందు సభాపతి రమేశ్‌కుమార్‌ను కలుసుకున్న కుమారస్వామి బలపరీక్షకు సంబంధించి సుమారు 20 నిమిషాలు చర్చించినట్లు తెలుస్తోంది.సంకీర్ణ ప్రభుత్వ ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని నిరూపించుకోవడానికి మరో రెండు రోజులు గడువు ఇవ్వాలంటూ కోరగా స్పీకర్ రమేశ్ మాత్రం ఎటువంటి హామీ ఇవ్వలేదన్నట్లు తెలుస్తోంది.తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల అంశాన్ని కుమారస్వామి ప్రస్తావించగా– అంతకుముందే తాను వారికి సమన్లను జారీ చేశానని స్పీకర్ వివరించారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయానికి ఆ 12 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తనను కలుసుకోవాల్సి ఉంటుందని అన్నారు. వారు హాజరు కాలేకపోతే– అనర్హత వేటు వేసే అంశాన్ని పరిశీలిస్తానని స్పీకర్ చెప్పారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ– ఒకవేళ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమైతే తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి తీరాల్సిందేనని కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించడంతో పాటు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అనుసరించి– వారిపై చర్యలు తీసుకోవాలని కుమారస్వామి కోరినట్లు చెబుతున్నారు. వారిపై వెంటనే అనర్హత వేటు వేయాలని, రాజీనామాల వల్ల ఖాళీ అయ్యే అసెంబ్లీ స్థానాలకు నిర్వహించే ఉప ఎన్నికల్లో తిరుగుబాటు ఎమ్మెల్యేలు పోటీ చేయకుండా ఉచ్చు బిగించాలని ఆయన స్పీకర్కు విజ్ఞప్తి చేశారని అంటున్నారు..