బాబ్రీ మసీద్ కూల్చివేసిన ఘటనకు సంబంధించి నేడు సిబిఐ కోర్టు వెల్లడించిన తీర్పుపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.పలువురు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తుండగా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కోర్టు తీర్పుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతీయ న్యాయవ్యవస్థకు ఈరోజు ఒక చీకటి రోజు అని అన్నారు. అయోధ్యలో వివాదాస్పద భూమికి సంబంధించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ… చట్టాలను ఉల్లంఘించారని, పద్ధతి ప్రకారం ప్రార్థనా స్థలాన్ని నాశనం చేశారని వ్యాఖ్యానించిందని చెప్పారు.సీబీఐ కోర్టు తీర్పు బాధాకరమని అన్నారు. మసీదు కూల్చివేత వెనక ఎలాంటి కుట్ర లేదని ఈరోజు కోర్టు తెలిపిందని అసహనం వ్యక్తం చేశారు. ఈ తీర్పును వెలువరించడం కోసం ఎంత కాలం కసరత్తు చేశారని అన్నారు. తాము పై కోర్టుకు వెళతామని చెప్పారు.సినీ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం హిట్ అండ్ రన్ కేసుతో పోల్చారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లు నిర్దోషులుగా ప్రకటించబడ్డారు. న్యాయాన్ని భూస్థాపితం చేశారు. సరికొత్త భారత్’ అని ట్వీట్ చేశారు.ఇక ఈ తీర్పుపై బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి స్పందించారు. కోర్టు చరిత్రాత్మక తీర్పును ఇచ్చినట్లు చెప్పారు.అయోధ్యలో 1992 డిసెంబర్ 6వ తేదీన ఎటువంటి కుట్ర జరగలేదని ఈ తీర్పుతో నిర్ధారణ అయినట్లు ఆయన వెల్లడించారు. తాము నిర్వహించిన కార్యక్రమాలు, ర్యాలీల్లో ఎటువంటి కుట్ర లేదన్నారు.కోర్టు తీర్పు సంతోషాన్నిచ్చిందని, రామ మందిర నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నట్లు జోషి తెలిపారు. తమకు ఫేవర్‌గా ఉన్న అంశాలను కోర్టు పరిశీలించడం సంతోషంగా ఉందన్నారు. కేవలం రామ మందిర నిర్మాణం కోసమే తమ ఉద్యమం సాగినట్లు జోషి తెలిపారు. జయ్ జయ్ శ్రీరామ్ అంటూ నినాదం చేశారు.ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఎల్ కే అద్వానీ స్పందించారు. బాబ్రీ మసీదు కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ తీర్పు రామజన్మభూమి ఉద్యమం పట్ల తన నిబద్దతతో పాటు బీజేపీ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అద్వానీ పేర్కొన్నారు.ఈ కేసులో అద్వానీ నిర్దోషిగా ప్రకటించబడటంతో ఆయన నివాసానికి పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు వెళ్లారు. ఇక ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.