మచిలీపట్నం: చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో కలిసి గతంలోనే సీఎం జగన్‌ను కలిశామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. మంత్రి పేర్ని నానిని బుధవారం ఆయన కలిశారు. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని దిల్ రాజు పేర్కొన్నారు. వకీల్ సాబ్ సినిమా సమయంలో కొన్ని పరిణామాలు వేగంగా జరిగిపోయాయన్నారు. ‘‘దయచేసి అందరూ వివాదాలకు మమ్మల్ని దూరంగా ఉంచండి. గతంలో మా విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందించింది. ఆన్‌లైన్ విధానం కావాలని పరిశ్రమ తరపున మేమే ప్రభుత్వాన్ని కోరాం. ఆన్‌లైన్ విధానం ద్వారా పారదర్శకత ఉంటుంది.’’ అని దిల్ రాజు తెలిపారు.
కాగా ఏపీలో ప్రభుత్వ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లు అమ్మకాల వ్యవహారం రచ్చ రచ్చ అవుతున్న విషయం తెలిసిందే. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. వైసీపీ వర్సెస్ జనసేనగా మారింది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఘాటుగా మండిపడ్డారు. దీంతో సినీ ఇండస్ట్రీ పెద్దలు అప్రమత్తమయ్యారు. ఏపీ మంత్రి పేర్నినానిని నిర్మాత దిల్ రాజు, తదితరులు కలిశారు.