న్యూఢిల్లీ: పాకిస్థాన్ పౌరులకు మనం పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం ఏముందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం బుధవారం ఇక్కడ ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించారు. ‘ధైర్యముంటే పాకిస్థానీయులు అందరికీ భారత పౌరసత్వం ఇవ్వడానికి సిద్ధమని బహిరంగంగా ప్రకటించాల’ని ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మోదీ విసిరిన సవాల్‌కు చిదంబరం ట్వీట్లో స్పందించారు. ‘పాకిస్థాన్ పౌరులకు మళ్లీ మనం ఎందుకు పౌరసత్వం కల్పించాలి. ప్రతి పక్షాలకు అలాంటి సవాళ్లు విసరడంలో అర్థం ఏంటీ? నేటి యువతరం, విద్యార్థులు ఉదారత, లౌకికవాదం ఉన్నవారు. సహనశీలులు. మానవతావాదాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాంటి విలువలను ప్రభుత్వం సవాల్ చేస్తోందా?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ మరో నేత, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కూడా మోదీ సవాల్‌ను ఖండించారు. ‘ప్రియమైన మోదీజీ పాకిస్థాన్ పౌరుల గురించి ఆలోచించడం మాని, కాస్త భారత పౌరులపై దృష్టి పెట్టండి. వారి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నించండి. మన పౌరుల సమస్యలను పరిష్కరించేందుకే ఈ దేశ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారని గుర్తుపెట్టుకోండి’ అని ట్విటర్లో దుయ్యబట్టారు.