బీజింగ్:పాకిస్థాన్ లోని ప్రధాన భూభాగంతో పాటు, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) పరిధిలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైనిక దళాలు చేపట్టిన దాడుల పట్ల చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగకుండా సంయమనం పాటించాలని సూచిస్తూ… భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ను తక్షణమే నిలిపివేయాలని కోరింది.పొరుగు దేశమైన పాక్ భారత్ దాడులకు దిగడం విచారకరమని చైనా అభిప్రాయపడింది. “ప్రస్తుత పరిస్థితి పట్ల మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. వివాదాన్ని మరింత జఠిలం చేసే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని రెండు దేశాలను కోరుతున్నాం” అని బీజింగ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. భారత్ చేపట్టిన సైనిక చర్యలను వెంటనే ఆపాలని ఆయన స్పష్టం చేశారు.కాగా, ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పర్యాటకుల హత్యకు ప్రతీకార చర్యల్లో భాగంగానే తాము ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్లో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా నిషేధానికి గురైన జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాలపై భారత్ దాడులు చేసింది.