న్యూ ఢిల్లీ: కార్పొరేట్ సంస్థలు బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనలు బ్యాంకింగ్ వ్యవస్థ వినాశనానికి దారి తీస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం బుధవారం ట్విట్టర్లో హెచ్చరించారు. ‘ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగంలో మొత్తం రూ. 140 లక్షల కోట్లకు పైగానే డిపాజిట్లు ఉన్నాయి. కార్పొరేట్ సంస్థలకు బ్యాంకులను ప్రారంభించేందుకు అనుమతిస్తే, అవి చాలా చిన్న చిన్న పెట్టుబడులతోనే దేశ ఆర్థిక వనరులను తమ గుప్పెట్లో పెట్టుకుని శాసిస్తాయి’అని ఒక వీడియోను విడుదల చేశారు. ‘ఈ ప్రతిపాదన పూర్తిగా తిరోగమనానికి ఆర్థిక, రాజకీయ శక్తుల జోక్యానికి ఎలా దారితీస్తుందో స్పష్టమైన, నమ్మదగిన కారణాలను డాక్టర్ రాజన్, డాక్టర్ ఆచార్య తెలియజేశారు. నిపుణులు వ్యతిరేకించిన అటువంటి ఆలోచనను ఆర్బీఐ ఆమోదం ఉన్నట్లు ప్రజలకు అందించడం ఆశ్చర్యకరమైనది. ఈ ప్రతిపాదననలు అమలులోకి వస్తే, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్న కార్పొరేట్ సంస్థలకు తొలి లైసెన్స్లు లభిస్తాయన్నది బహిరంగ రహస్యం. దేశంలోని కార్పొరేట్ సంస్థల సముపార్జన ఆశయాలకు మోదీ ప్రభుత్వం సహకరిస్తుందనడానికి ఇది మరొక ఉదాహరణ’ని దుయ్య బట్టారు.