కబ్జా భూములు తిరిగి స్వాధీనం

కబ్జా భూములు తిరిగి స్వాధీనం

చల్లపల్లి: లక్ష్మీపురం పంచాయతీ శివారు బిరుదుగడ్డ వద్ద పెద్దల కబ్జాలో ఉన్న యేపు మురుగు కాలువ భూములను వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పేదలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. చింతలమడ నుంచి ఎర్ర జెండాలతో ఈ భూముల వరకూ మంగళ వారం ర్యాలీగా వెళ్లారు. పేదల నుంచి కొందరు ‘పెద్దలు’ కబ్జా చేసిన 80 ఎకరాల భూముల్లో ఎర్ర జెండాలు పాతారు. ఆ భూములను చింతలమడలోని నిరుపేద దళితులకు పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. ఈ భూముల్ని గతంలో చింతలమడకు చెందిన నిరుపేద దళితులు సాగు చేసుకునే వారు. రెవెన్యూ అధికారులు బలవంతంగా ఆ భూముల నుంచి ఖాళీ చేయించారు. ఆ తర్వాత ఆ భూములను కొందరు పెద్దలు కబ్జా చేశారు. అధికారులు ఇందుకు వీలు కల్పించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ కార్మిక సంఘం అండతో ఆ భూముల్లో జెండాల్ని పాతి పేదలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మాట్లాడుతూ పెద్దలకు అనుకూలంగా పేదలకు వ్యతిరేకంగా రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తోందనే విషయం ఈ భూముల ఉదంతంలో రుజువైందని వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణా జిల్లా తూర్పు కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యద్దనపూడి మధు, మురాల రాజేష్ విమర్శించారు. భూముల కబ్జాదార్లు చెరువులు తవ్వి రూ.లక్షలాది విలువైన మట్టిని అమ్ముకున్నారని ఆరోపించారు. వారిపై కేసులు పెట్టకుండా నామమాత్రంగా జరిమానాలు విధించి సరిపెట్టారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అసైన్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి డ్రెయిన్ భూములను పెద్దల నుంచి స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన భూములను పేదలకు పంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎ.గగారిన్, చింతలమడ దళితవాడకు చెందిన పేదలు పాల్గన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos