దుబాయి : ఇంగ్లాండ్ యువ క్రికెటర్ విల్‌జాక్స్ సంచలనం సృష్టించాడు. కేవలం 25 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దుబాయిలో లంకాషైర్, సర్రే జట్ల మధ్య ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ టీ10 మ్యాచ్ గురువారం జరిగింది. తొలుత బ్యాట్ చేసిన సర్రే జట్టు మూడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విల్‌జాక్స్ 30 బంతుల్లో 105 పరుగులు చేశాడు. అందులోనూ ఓ ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంకాషైర్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌కు అధికారిక హోదా లేకపోవడంతో రికార్డు పుటల్లో విల్‌జాక్స్ రికార్డు నమోదయ్యే అవకాశం లేదు. మ్యాచ అనంతరం విల్‌జాక్స్ మాట్లాడుతూ ఈ ఇన్నింగ్స్ నాకెప్పుడూ గుర్తుండిపోతుందని సంతోషం వ్యక్తం చేశాడు.