ముంబై: నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇక భారత్‌లోనూ 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయినప్పటికీ దేశంలో కొవిడ్ పరిస్థితి నియంత్రణలో ఉందని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.మహారాష్ట్రలో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే పాజిటివ్ కేసుల సంఖ్య 12 నుంచి 56కి పెరిగింది. అంతేకాదు మరణాలు కూడా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్ నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇక దేశంలో అత్యధికంగా కేరళలో 95 కొవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో 257 కొవిడ్ కేసులు
సింగపూర్, హాంకాంగ్‌లలో కొవిడ్ కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) సమీక్షా సమావేశం నిర్వహించింది. మన దేశంలో ప్రస్తుతం 257 కొవిడ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇవి స్వల్ప లక్షణాలు గల కేసులని, వ్యాధిగ్రస్థులను దవాఖానలలో చేర్పించి, చికిత్స చేయవలసిన అవసరం లేదని వివరించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Also Read..