న్యూఢిల్లీ : దేశంలో క్షయ వ్యాధి వల్ల రోజుకు 1200 మంది మరణిస్తున్నారు. కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు రోజుకు వెయ్యి మందికి పైగా మరణించారు. ఇప్పుడు మరణాల సంఖ్య రోజుకు 500 కంటే తక్కువ. భారతీయులు నేటికి టీబీకి భయపడడం లేదుగానీ కరోనాకు భయపడుతున్నారు. టీబీతో పోలిస్తే కరోనా ఒకరి నుంచి ఒకరి అది వేగంగా విస్తరించడమే దీనికి కారణం. కరోనా కట్టడి చేయడంలో తలముక్కలై ఉన్న వైద్యాధికారులు క్షయ రోగులను పూర్తిగా విస్మరించారు. నిరుడు పుల్మరో టీబీ (ముందుగా ఊపిరి తిత్తులకు వ్యాపించి అక్కడి నుంచి ఇతర అవయవాలకు విస్తరించడం)తో బాధ పడుతున్న వారు వైద్య పరీక్షల కోసం ల్యాబ్లకుగానీ ఆస్పత్రులకుగానీ వెళ్లలేదు. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం ప్రధాన కారణం. ఆస్పత్రు ల్లో మందులూ దొరక లేదు. టీబీ రోగులకు రెండు, మూడు నెలలకు సరిపోయే మందులను ముందస్తుగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. కరోనా కారణంగా అదీ జరగలేదు. అనేక మంది టీబీ రోగులు కూడా కరోనా కాబోలనుకొని పరీక్షలు చేయించుకొని నెగటివ్ అని తేలగానే ఇంటికి వచ్చారు. కరోనాతోపాటు టీబీ పరీక్షలు నిర్వహించడం కాస్త క్లిష్టమైన విషయం కావడంతో భారత వైద్యులు టీబీ పరీక్షలను పూర్తిగా విస్మరించారు. పర్యవసానంగా వెయ్యి మందికి పైగా మృత్యువాత పడ్డారు. టీబీని సకాలంలో గుర్తిస్తే చికిత్సతో సులభంగానే నయం చేయవచ్చు.