విజృంభిస్తున్న మహమ్మారి

న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే 700కు చేరువలో కొత్త కేసులు బయటపడ్డాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 692 కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటి వరకూ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,50,10,944కి చేరింది. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,097గా ఉంది. మహమ్మారి నుంచి ఇప్పటి వరకూ 4,44,73,448 మంది కోలుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా ఆరు మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,33,346కి ఎగబాకింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos