హైదరాబాదు:: విద్యుత్ స్తంభాలపై ఇంటర్నెట్, కేబుల్ వైర్ల తొలగింపుపై సోమవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల రామంతాపూర్ విద్యుత్ ప్రమాద ఘటనలో ఐదుగురు మృతి చెందిన సంగతి విదితమే. విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్ల వల్లనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్లను సిబ్బంది తొలగిస్తున్నారు. దీంతో ఎయిర్‌టెల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అనుమతి తీసుకున్న కేబుళ్లను సైతం తొలగిస్తున్నారని సంస్థ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఏయే స్తంభాలకు అనుమతి తీసుకున్నారో చూపించాలని టీజీఎస్పీడీసీఎల్ తరఫు న్యాయవాది కోరారు. వాదనలు విన్న ధర్మాసనం అనుమతిలేని కేబుళ్లను తొలగించొచ్చని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.