కోల్కతా: నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పది రోజుల ఆందోళనకు పిలుపునిచ్చిన పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం సరి కొత్త నినాదం – కా. కా. ఛీ. ఛీ. అందుకున్నారు. మంగళవారం ఇక్కడ వరుసగా రెండో రోజు జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆమె ఈ నినాదాన్ని అక్కడున్న అందరితోనూ పలికించారు. పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్), ఎన్నార్సీలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆమె డిమాండ్ చేసారు. ‘క్యాబ్, ఎన్నార్సీలను వెనక్కి తీసుకోవాలి. క్యాబ్, ఎన్నార్సీ షేమ్. షేమ్. భాజపా షేమ్. షేమ్’అని నినదించారు. మమతా బెనర్జీ చేసిన నినాదాలు సామాజిక మాధ్యమాల్లో సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి. ‘ఆమె ఆందోళనలో నేను కూడా ఉన్నాను. ‘ఛీ..ఛీ’ అంటూ ఆమె నినాదాలతో గొంతుకలిపాను. భలే సరదాగా అనిపించింది’ అని ఓ నెటిజన్ పేర్కొన్నారు.