ఢిల్లీ : కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పెదవి విరిచారు. కేంద్ర బడ్జెట్‌తో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని భావించడం లేదన్నారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఆశించినంతగా లేవని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై భారంగా పరిణమించనుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి విమర్శించారు. కేంద్రం సొంత డబ్బా కొట్టుకోవడానికి ప్రయత్నించిందని ఎద్దేవా చేశారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్నారని, దానికి అనుగుణమైన చర్యలేమిటో బడ్జెట్‌లో వెల్లడించలేదని విమర్శించారు.