స‌బ్సి‌డీలకు కోత‌లు

స‌బ్సి‌డీలకు కోత‌లు

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో సామాన్య, పేదలు, రైతులకు సంబంధించిన వాటిపై కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. ఆహారం, వంటగ్యాస్, పెట్రోలియం, యూరియా వంటి ఎరువులకు బడ్జెట్ కేటాయింపులు తగ్గాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో సామాన్య, పేద ప్రజలకు ఎటువంటి ఉపశమనం కలగలేదు. పైగా ఆయా వర్గాలకు సంబంధించిన రంగాల కేటాయింపుల్లో కోత విధించారు. ఆహారానికి సంబంధించి 2022-23 బడ్జెట్లో రూ.2,72,802 కోట్లు కేటాయించగా, 2022-23లో దాన్ని రూ.2,12,332 కోట్లకు తగ్గించారు. దాన్ని 2024-25 బడ్జెట్లో రూ.2,05,250 కోట్లకు తగ్గించారు. ప్రజా పంపిణీకి 2023-24లో రూ 137.36 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.106.73 కోట్లకు తగ్గించారు. గ్యాస్ సబ్సిడీకి 2023-24లో రూ 12,240 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.11,925.01 కోట్లకు తగ్గించారు.
పెట్రోలియంకు సంబంధించి 2023-24 బడ్జెట్లో రూ.12,240 కోట్లు కేటాయించగా, దాన్ని 2024-25 బడ్జెట్లో రూ.11,925 కోట్లకు తగ్గించారు. రైతులకు సంబంధించిన ముఖ్యమైన ఎరువులకు 2022-23 బడ్జెట్లో రూ. 2,51,339 కోట్లు కేటాయించగా, 2023-24లో రూ.1,88,894 కోట్లకు తగ్గించారు. దాన్ని 2024-25 బడ్జెట్లో రూ.1,64,000 కోట్లకు తగ్గించారు. అందులోనూ యూరియాకు 2022-23 బడ్జెట్లో రూ.1,65,217 కోట్లు కేటాయించగా, 2023-24లో దాన్ని రూ.1,31,100 కోట్లకు తగ్గించారు. 2024-25 బడ్జెట్లో రూ.1,19,000 కోట్లకు తగ్గించారు. పంటల బీమా పథకానికి సంబంధించి 2023-24 బడ్జెట్లో రూ.15,000 కోట్లు కేటాయించగా, దాన్ని 2024-25 బడ్జెట్లో రూ.14,600 కోట్లకు తగ్గించారు.
నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్ హెచ్ఎం)కు కేటాయింపులే లేవు. స్మార్ట్ సిటీలకు 2023-24లో రూ 13,200 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.10,400 కోట్లకు తగ్గించారు. అంగన్వాడీలకు 2023-24లో రూ 21,523 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.21,200 కోట్లకు తగ్గించారు. అంటే రూ. 323 కోట్లు తగ్గించారు. మహిళా భద్రత పథకాల కేటాయింపుల్లో భారీ కోత విధించారు. 2023-24లో రూ 1,009 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.155 కోట్లకు తగ్గించారు.
ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి 2023-24 బడ్జెట్లో రూ.34,354 కోట్లు కేటాయించగా, దాన్ని సవరించిన అంచనాల్లో రూ.32,800 కోట్లకు తగ్గించారు. 2024-25 బడ్జెట్లో రూ.31,107 కోట్లకు తగ్గించారు. అంటే రూ.3,247 కోట్లు తగ్గించారు. కోల్ ఇండియా లిమిటెడ్కు భారీ కోత పడింది. 2023-24లో రూ 16,500 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.15,500 కోట్లకు తగ్గించారు. ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్కు 2023-24లో రూ 2,880 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.2,429 కోట్లకు తగ్గించారు.
సాంస్కతిక పథకాలకు 2023-24లో రూ 808.77 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.520.24 కోట్లకు తగ్గించారు. అకాడమీ, మ్యూజియంలకు బడ్జెట్లో కోత విధించారు. అకాడమీలకు సంబంధించి 2023-24లో రూ.435.45 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.389.37 కోట్లకు తగ్గించారు. మ్యూజియంలకు సంబంధించి 2023-24లో రూ 389.40 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్లో రూ.373.70 కోట్లకు తగ్గించారు. పిఎంకిసాన్, ఉపాధి హామీకి ఎటువంటి పెంపుదల లేదు. గతంలో కేటాయించిన వాటినే కాపీ, పేస్టు చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos