న్యూ ఢిల్లీ:దేశంలోనే తొలిసారిగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సిమ్ రహిత ‘క్వాంటమ్ 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ'(Q-5G) సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఎఫ్‌డబ్ల్యూఏ అంటే ‘ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్’ అని అర్థం. తొలి విడతగా ఈ సేవలు హైదరాబాద్ నగరంలో పరిమిత స్థాయిలో ప్రారంభమయ్యాయి. ఈ సిమ్ రహిత 5జీ సర్వీసును సబ్‌స్క్రయిబ్ చేసుకునే వారికి 5జీ రేడియో యాక్సెస్ టెక్నాలజీ ద్వారా ఫైబర్ నెట్ తరహాలో వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ లభిస్తుంది. తదుపరి విడతల్లో 2025 సెప్టెంబరుకల్లా ఈ సర్వీసును బెంగళూరు, పుదుచ్చేరి, విశాఖపట్నం, పుణె, గ్వాలియర్, చండీగఢ్ నగరాలకు విస్తరించనున్నారు.
ప్రారంభించిన బీఎస్ఎన్‌ఎల్ సీఎండీ
‘క్వాంటమ్ 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ’ సర్వీసును జూన్ 18న హైదరాబాద్‌లోని బీఎస్ఎన్ఎల్ అమీర్‌పేట్ ఎక్స్ఛేంజిలో బీఎస్ఎన్‌ఎల్/ఎంటీఎన్ఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ఎ.రాబర్ట్ జె.రవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్‌ఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, తెలంగాణ సీజీఎం, కేంద్ర టెలికాం శాఖ ఉన్నతాధికారులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. క్వాంటమ్ 5జీ సర్వీసులకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.bsnl.co.in, www.telangana.bsnl.co.in వెబ్‌సైట్లను చూడొచ్చు. లేదంటే మీ సమీపంలోని బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటరును సంప్రదించొచ్చు.