తిరువనంత పురం : కేరళ శాసన సభలో శుక్రవారం గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రసంగాన్ని విపక్షాలు బహిష్కరించాయి. శుక్రవారం విపక్ష-యూడీఎఫ్ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినపుడు గందరగోళం ఏర్పడింది. ప్రసంగాన్ని అడ్డుకుంటూ ప్రతిపక్ష సభ్యులు పదే పదే నినాదాలు చేశారు. దీంతో ఆయన చాలాసార్లు మధ్యలో తన ప్రసంగాన్ని ఆపారు. యూడీఎఫ్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ, ‘‘మీరు లేచి నిల్చుని, నినాదాలు చేశారు. దయచేసి నన్ను నా రాజ్యాంగ విధిని నిర్వహించనివ్వండి. నాకు అంతరాయం కలిగించవద్దు’’ అని కోరారు. విపక్ష నేత రమేశ్ చెన్నితాల మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అవినీతి మయం అయిందని దుయ్యబట్టారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల రాష్ట్రంలో సాంఘిక, ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర జీడీపీలో రూ.80 వేల కోట్లు లోటు ఏర్పడిందన్నారు.