ముంబై : ముంబై ఎయిర్పోర్ట్ లో బుధవారం కారు డ్రైవర్లు, ఎయిర్పోర్ట్ సిబ్బంది మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరినొకరు రోడ్డుపై పడేసి మరీ కొట్టుకున్నారు. సంబంధిత వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పార్కింగ్ స్థలం వద్ద వాహనాలు నిలిపే విషయంలో క్రిస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, పలువురు డ్రైవర్లకు మధ్య మాటల యుద్ధం సాగింది. మాటా మాటా పెరగడంతో అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్రంగా కొట్టుకున్నారు. కాలర్లు పట్టుకుని, రోడ్డుపై పడేసి పిడిగుద్దులు గుద్దుకున్నారు. దీంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో అక్కడే విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ అధికారులు జోక్యం చేసుకున్నారు. ఇరు వర్గాలను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ కారణంగా విమానాశ్రయ కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం కలిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎయిర్పోర్ట్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.