ముంబై : ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపుల అనంతరం శుక్రవారం బాంబే హైకోర్టు కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో, న్యాయవాదులు, ఇతర కోర్టు సిబ్బందిని కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయమని అధికారులు కోరారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. బాంబే హైకోర్టు న్యాయవాది మంగళ వాఘే మాట్లాడుతూ, ‘ఈరోజు బాంబే హైకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో, కోర్టును ఖాళీ చేశారు. పోలీసులు దానిపై దర్యాప్తు చేస్తున్నారు.’ అని తెలిపారు. బాంబే హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయమని పోలీసులు కోరినట్లు మరో న్యాయవాది తెలిపారు. కోర్టు ప్రాంగణం, చుట్టుపక్కల బాంబు బెదిరింపు హెచ్చరికతో కోర్టు పరిసరాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. హెచ్చరికలు వచ్చిన వెంటనే, హైకోర్టులోని అన్ని బెంచీలు వెంటనే లేచి బయటకు పరుగులు తీశారు. దీంతో కోర్టులో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. న్యాయ మూర్తులు, న్యాయవాదులు, ప్రజలు భయంతో కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు పరుగులు తీశారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్లతో సహా భద్రతా దళాలు ఆ ప్రాంతానికి హుటాహుటీన చేరుకుని చర్యలు చేపట్టాయి. ముందు జాగ్రత్త చర్యగా అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లను రంగంలోకి దించారు. స్నిఫర్ డాగ్‌లతో కూడిన బృందాలు కోర్టు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.