రాయ్‌గఢ్ : తీరంలో ఓ అనుమానాస్పద పడవ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆదివారం తీరప్రాంతం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేసి హైఅలర్ట్ ప్రకటించారు. రేవ్‌దండా తీరంలోని కోర్లాయి ప్రాంతానికి సుమారు రెండు నాటికల్ మైళ్ల దూరంలో ఈ పడవను భద్రతా సిబ్బంది గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ పడవపై మరో దేశానికి చెందిన గుర్తులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఇది రాయ్‌గఢ్ తీరానికి కొట్టుకు వచ్చి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సమాచారం అందిన వెంటనే రాయ్‌గఢ్ పోలీసులు, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్), క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్‌టీ) బృందాలతో పాటు నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా పడవ వద్దకు వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలకు ఆటంకం కలిగింది. బార్జ్ సహాయంతో పడవను సమీపించేందుకు ప్రయత్నించినా, వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా, ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించి జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.