విజయవాడ : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని రద్దు చేయకూడదని కేంద్రాన్ని డిమాండు చేస్తూ 2020 జనవరి 8 న దేశ వ్యాప్త సమ్మెకు సిఐటియు పిలుపునిచ్చింది. కార్మిక చట్టాల సవరణలో భవన నిర్మాణ కార్మికుల చట్టం రద్దుకూ కేంద్ర ప్రభు త్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. పెట్టుబడిదారుల లాభాల వృద్ధికి ఏ చిన్న అవరోధమూ లేకుండా చేయటమే కేంద్ర ప్రభు త్వం లక్ష్యమని విమర్శించింది. దరిమిలా సంక్షేమ పథకాలూ రద్దు కాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమ పథకాల అమలుకు మాత్రమే ఖర్చు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సాక్షాత్తూ అత్యు న్నత న్యాయస్థానం చేసిన ఆదేశాన్ని కేంద్రం తుంగలో తొక్కింది. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ నిధులను దుర్వి నియోగం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం మందలించలేదు. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టా రాజ్యంగా ఖర్చు చేస్తున్నా గుడ్లప్పగించి చూడటం తప్ప అడ్డుకోలేదు. వైకాపా ప్రభుత్వం కూడా బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నిబంధనలను కఠినతరం చేసి పథకాలు అమలు కాకుండా అడ్డు కుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా ఇసుక తవ్వకాలను నిషేధించినందున 30 లక్షల పైగా భవన నిర్మాణ కార్మికులు పనులు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ కారణంగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మ హత్య లు చేసుకున్నారు. వారి కుటుంబాన్ని నేటికి ఆదుకోలేదని సిఐటియూ నేతలు ఆవేదన చెందారు. పనులు కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు పదివేల రూపాయల జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు.