కోల్కతా: పశ్చిమ బంగలో మూడు శాసనసభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఒక స్థానం అధికార తృణమూల్ కాంగ్రెస్ కైవశమైంది.మిగిలిన రెండు చోట్ల కూడా టీఎంసీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కలియా గంజ్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి తపన్ దేవ్ సిన్హా తన సమీప భాజపా అభ్యర్థిపై 2,304 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక ఖరగ్పూర్ సర్దార్, కరీంపూర్లలోనూ తృణమూల్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మూడు స్థానాలకు నవంబరు 25న ఎన్నికలు నిర్వహించారు. నేడు ఫలితాలు వెలువడుతున్నాయి. ఉత్తరా ఖండ్, ఫిథోర్గఢ్ శాసనసభ నియోజక వర్గానికీ గత సోమవారం ఉప ఎన్నిక నిర్వహించారు. గురువారం ఓట్ల లెక్కింపులో భాజపా అభ్యర్థి చంద్ర ఆధిక్యంలో కొనసాగుతున్నారు.