దశాబ్దాలుగా అయోధ్య రామజన్మపై జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం విఫలం కావడంతో కొద్ది రోజులుగా సుప్రీంకోర్టు వివాదంపై రోజువారీ విచారణ జరుపుతోంది.ఈ క్రమంలో రామ్‌లల్లా విరాజ్‌మాన్ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది పరాశరన్‌ను విచారణ జరుపుతున్న ప్రధాన న్యాయమూర్తి అడిగిన ఓ ప్రశ్నకు బీజేపీ ఎంపీ చెప్పిన సమాధానం చర్చనీయాంశమైంది. అయోధ్యలో శ్రీరాముని వంశానికి చెందిన వారు ఎవరైనా ఇప్పటికీ నివసిస్తున్నారా అంటూ ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించగా బీజేపీ ఎంపీ, జైపూర్ రాజ వంశీకురాలు దియా కుమారి తాము శ్రీరాముడి వంశానికి చెందిన వారమంటూ బదులిచ్చారు.‘ఔను శ్రీరాముడి వారసులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆయన కుమారుడు కుశుడి వంశానికి చెందిన తమ కుటుంబంతో సహా’ అని ట్వీట్ చేశారు.తాము రాముడి వంశస్థులమని చెప్పడం వెనుక తనకు ఎటువంటి దురుద్ధేశ్యం లేదని దియా స్పష్టం చేశారు. అయోధ్య వివాదం రగులుతున్న వివాదాస్పద స్థలంపై తమకు ఎటువంటి హక్కు, ఆపేక్ష లేవని ఆమె తెలిపారు.న్యాయ ప్రక్రియలో భాగం కావాలని తాము కోరుకోవడం లేదని.. ఎటువంటి ఉద్దేశ్యం లేకుండా తన మనసులో మాటను చెప్పానని దియా ట్వీట్ చేశారు. ఇదే అంశంపై జైపూర్లోని సిటీ ప్యాలెస్ మ్యూజియం ప్రత్యేకాధికారి రాము రాందేవ్ మాట్లాడుతూ ప్రస్తుత జైపూర్ రాజు పద్మనాభ్ సింగ్ శ్రీరాముడి కుమారుడు కుశుడి 309వ తరానికి చెందిన వారన్నారు.జైపూర్ రాజవంశీకులు రాజ్పుట్లలోని కచ్వాహ గోత్రానికి చెందిన వారని… రాజస్థాన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ హెడ్ ఆర్ నాథ్ రాసిన పుస్తకం తెలుపుతోంది. అయోధ్యంలోని రామ దేవాలయం ఉన్నటువంటి జైసింగ్పురపై యాజమాన్య హక్కు కచ్వాహాలదేని రాందేవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు సిటీ ప్యాలెస్ మ్యూజియంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయోధ్యకు, రామాలయానికి సంబంధించిన అత్యంత ప్రాచీన మ్యాపును మీడియాకు ప్రదర్శించారు..
Yes, Descendants of Lord Ram are all over the world, including our family who descended from his son Kush. https://t.co/dFTmFPwJk0
— Diya Kumari (@KumariDiya) August 10, 2019