న్యూ ఢిల్లీ : చండీఘఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసపూరిత వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం నిరసనలు చేపట్టింది. పలువురు ఆప్ కార్యకర్తలను సింఘు బోర్డర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకోగా కొందరు నేతలను ఢిల్లీలో హౌస్ అరెస్ట్ చేశారు. నిరసనల్లో పాల్గొనేందుకు హరియాణ, పంజాబ్ నుంచి వస్తున్న ఆప్ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు నగర సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఆప్ కార్యాలయం ఎదుట తాము కూడా నిరసన చేపతామని బీజేపీ ప్రకటించడంతో ఢిల్లీలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. నగరంలో ఎలాంటి ఘర్షణలు చెలరేగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించినా పంజాబ్ నుంచి ఆప్ కార్యకర్తలు తరలివస్తున్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఆ పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఆప్ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారని అసలు దేశ రాజధానిలో ఏం జరుగుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.