లోక్‌సభ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో బీజేపీ తెలంగాణలోని 17 ఎంపీ నియోజకవర్గాల పైకి పది నియోజకవర్గాలకు అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసింది.మొదటి జాబితాలో కీలకమైన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.అందులో సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, మల్కాజ్గిరి, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ,భువనగిరి,నాగర్ కర్నూల్,నిజామాబాద్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. సామాజిక,రాజకీయ సమీకరణాలు పరిగణలోకి తీసుకొని విజయావకాశాలపై సర్వేలు,సమీక్షలు చేయించిన అనంతరం అభ్యర్థులను ప్రకటించినట్లు తెలుస్తోంది.సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ బండారు దత్తాత్రేయకు తమ అంతర్గిత సర్వేలో ప్రతికూల ఫలితాలు రావడంతో దత్తన్నకు బదులుగా బీజేపీ యువనేత కిషన్‌రెడ్డికి టికెట్ కేటాయించారు.కీలకమైన మల్కాజ్‌గిరిపై కాంగ్రెస్,తెరాసలు ప్రత్యేక దృష్టి సారించడంతో బీజేపీ కూడా కాంగ్రెస్,తెరాస అభ్యర్థులకు ధీటైన అభ్యర్థనే నమ్మకంతో ఎమ్మెల్సీ రామచంద్రరావును బరిలో దించింది.మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ తరపున రేవంత్‌రెడ్డి,తెరాస తరపున మర్రి రాజశేఖర్‌రెడ్డిలు బరిలో దిగనున్నారు.ఇక మహబూబ్‌నగర్ నుంచి కొద్దిరోజుల క్రితం బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ డీకే అరుణకు టికెట్ దక్కగా కరీంనగర్ నుంచి బండి సంజయ్‌కు మరోసారి టికెట్ దక్కింది.నాగర్ కర్నూల్ నుంచి బంగారు శృతి,వరంగల్ నుంచి చింతా సాంబమూర్తి, మహబూబాబాద్ నుంచి హుసేన్ నాయక్,నల్గొండ నుంచి జితేంద్రకుమార్,భువనగిరి నుంచి శ్యామ్ సుందర్,నిజామాబాద్ నుంచి డీ.శ్రీనివాస్ తనయకుడు డీ.అరవింద్ బరిలో దిగనున్నారు.నిజామాబాద్ నుంచి కేసీఆర్ కుమార్తె కవిత,కాంగ్రెస్ నుంచి మధు యాష్కిలు పోటీ చేయనుండడంతో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది.మిగిలిన ఏడు నియోజకవర్గాలకు అతిత్వరలోనే అభ్యర్థులను విడుదల చేసే అవకాశం ఉంది..