బిజెపి ఖాతాలోనే అధిక విరాళాలు

బిజెపి ఖాతాలోనే అధిక విరాళాలు

న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరంలో బిజెపికి రూ.2,244 కోట్ల విరాళాలు లభించాయి. 2022-23లో ఆ పార్టీకి వచ్చిన విరాళాలతో పోలిస్తే ఇది మూడు రెట్లు అదనం. బిజెపికి ప్రుడెంట్‌ ఎలక్టొరల్‌ ట్రస్ట్‌ అందరి కంటే అధిక మొత్తంలో విరాళం అందించింది. గత ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్‌కు రూ.288.9 కోట్ల విరాళాలు అందాయి. 2022-23లో కాంగ్రెస్‌కు వచ్చిన విరాళాల మొత్తం రూ.79.9 కోట్లు మాత్రమే. బిజెపికి రూ.20,000, ఆ పైన విరాళం అందించిన వారిలో వ్యక్తులు, ట్రస్ట్‌లు, కార్పొరేట్‌ సంస్థలు ఉన్నాయి.2023-24లో బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలకు అందిన విరాళాల వివరాలు ఇప్పుడు ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైటులో అందుబాటులో ఉన్నాయి. ప్రుడెంట్‌ ఎలక్టొరల్‌ ట్రస్ట్‌ నుండి బిజెపికి, రూ.723.6 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.156.4 కోట్ల విరాళాలు అందాయి. 2022-23లో ప్రుడెంట్‌ ట్రస్ట్‌కు అధిక మొత్తంలో విరాళాలు అందించిన వారిలో మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌, సెరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఆర్సెలర్‌ మిట్టల్‌ గ్రూప్‌, భారతి ఎయిర్‌టెల్‌ ఉన్నాయి. బిజెపికి, కాంగ్రెస్‌ పార్టీలు ప్రకటించిన మొత్తం విరాళాల వివరాలలో ఎన్నికల బాండ్ల ద్వారా అందిన విరాళాలను చేర్చలేదు.తమకు ఎన్నికల బాండ్ల ద్వారా లభించిన విరాళాల సమాచారాన్ని కొన్ని ప్రాంతీయ పార్టీలు 2023-24లో స్వచ్ఛందంగా ప్రకటించాయి. వీటిలో బీఆర్‌ఎస్‌, డీఎంకే, వైసీపీ, జేఎంఎం ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని పార్టీల కంటే బీజేపీకే అత్యధికంగా విరాళాలు సమకూరాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది బీజేపీకి 212 శాతం ఎక్కువగా విరాళాలు అందాయి. ఎలక్టొరల్‌ ట్రస్టుల ద్వారా ఆ పార్టీకి సమకూరిన మొత్తం రూ.850 కోట్లు. గత ఆర్థిక సంంవత్సరంలో ప్రుడెంట్‌ ట్రస్ట్‌ బీఆర్‌ఎస్‌, వైసీపీకి కూడా విరాళాలు ఇచ్చింది. ఈ రెండు పార్టీలు ఎన్నికలలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి ప్రుడెంట్‌ ట్రస్ట్‌ నుండి రూ.33 కోట్ల విరాళం అందింది.గత సంవత్సరం బీజేపీకి విరాళాలు అందించిన సంస్థలలో ఫ్యూచర్‌ గేమింగ్‌ అండ్‌ హోటల్‌ సర్వీస్‌ ఒకటి. ఇది లాటరీ కింగ్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన శాంటినో మార్టిన్‌కు చెందిన సంస్థ. మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్టిన్‌పై ఈడీ, ఐటీ అధికారులు దృష్టి సారించారు. సీపీఐ (ఎం)కు 2022-23లో రూ.6.1 కోట్ల విరాళం అందగా గత ఏడాది రూ.7.6 కోట్లు వచ్చాయి. ఆప్‌, బీఎస్పీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, బీజేడీ, టీడీపీ, సమాజ్‌వాదీ పార్టీలు కూడా తమకు అందిన విరాళాల వివరాలను ప్రకటించాయి. గత ఆర్థిక సంవత్సరంలో టీడీపీకి రూ.100 కోట్లకు పైగా విరాళాలు అందాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos