మెజారిటీ వాదాన్నిఅంగీకరించని హిందూ ఓటర్లు

మెజారిటీ వాదాన్నిఅంగీకరించని హిందూ ఓటర్లు

న్యూఢిల్లీ : ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణాన్ని చేసినా ఎన్నికల ముందు ఉన్న వాడీ, వేడీ ప్రస్తుతం ఆయనలో కనుమరుగైందని రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. ఎన్నికల సందర్భంగా తనను తాను రాజు, దేవుడిగా అభివర్ణించుకున్న మోదీని ప్రజలు నీవు రాజువు కావు, దేవుడివి అంతకన్నా కావంటూ చాలా సీట్లలో ఓడించి పంపారు. బతుకుజీవుడా అని మిత్రుల మద్దతుతో పీఠాన్ని అధిరోహించిన మోదీ ఇప్పుడు మునుపటి సామాన్య ప్రధానే. అయితే హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్గా తనను తాను భావించుకునే మోదీ ఈ ఎన్నికల ప్రచారంలో దానిని బహిర్గతం చేసుకోవడానికి ఏమాత్రం మొహమాటం పడలేదు. దాని పర్యవసానంగానే ఒక వర్గం వారిని నేరుగానే తన ప్రచారంలో టార్గెట్ చేశారు. ఇది సహజంగానే ఆ వర్గాల్లో కోపం రగిలించింది. అయితే తాజాగా వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఆయన వాదాన్ని అటు హిందువులు కూడా పూర్తిగా అంగీకరించలేదన్న వాదన వినిపిస్తున్నది. భారత దేశమంటేనే విభిన్న మతాలు, కులాలు, జాతులు, భాషలు, పార్టీలు, విధానాల సమ్మేళనం. దీని వల్ల సామాన్య ఓటరు ఎలా వ్యవహరిస్తాడు ఎలా స్పందిస్తాడనేది ఊహించడం అసాధ్యం. ఈ ఎన్నికల్లో హిందీ మాట్లాడే రాష్ర్టాలతో పాటు ఈశాన్య భారతంలోని కొన్ని చోట్ల బీజేపీ బాగా నష్ట పోయింది. బీజేపీపై దళిత-బహుజన కులాలు ఈసారి ఆ పార్టీపై నమ్మకం కోల్పోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా హిందుత్వ నినాదానికి గుండెకాయగా భావించే యూపీలో ఈ విషయం ప్రస్ఫుటంగా కనిపించింది. పలు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే సావర్కర్ హిందుత్వ భారత్ విజన్ పట్ల వ్యతిరేకతో, నెహ్రూ లౌకిక జాతీయవాదానికి అనుకూలంగానో ప్రజలు స్పందించారనో, సాంస్కృతిక న్యాయంపై సామాజిక న్యాయం జయించాలన్న అంబేద్కర్ నినాదానికి మద్దతు తెలిపారనో భావించడం కష్టసాధ్యమవుతుందని వారు పేర్కొంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos