అమరావతి: విద్య, ఉద్యోగం, కెరీర్ గురించి ఆలోచిస్తూ సంతానం విషయంలో దంపతులు వెనకాడుతున్నందున ఏపీలో జననాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మరణాల రేటు మాత్రం పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్-2022 ప్రకారం రాష్ట్రంలో జననాల సంఖ్య 2015లో 8,51,499 కాగా 2022లో అవి 7,52,403 కి పడిపోయాయియ. 2018లో 3,10,640 మరణాలు, 2022లో 4,30,838 మరణాలు సంభవించాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం గడిచిన 2 సంవత్సరాల నుంచి జననాలు ఏటా 6 లక్షల్లోపే ఉంటున్నాయి. ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజులు ఏటా పెరిగిపోతున్నాయి. దీనికి తగ్గట్లు జీతాలు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒక బిడ్డకు మాత్రమే పరిమితం కావాలన్న ఆలోచన చాలామంది దంపతుల్లో పెరుగుతోంది. మరోవైపు బాగా స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకునే వారు కూడా ఎక్కువైపోతున్నారు. దీనివల్ల 28-30 ఏళ్లు వచ్చేవరకూ యువత పెళ్లి చేసుకోవడం లేదు. ఉద్యోగ అవకాశాల కోసం యువత హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్తున్నారు. విదేశాలకు వెళ్లే వారు అక్కడే పెళ్లి చేసుకుని స్థిరపడుతున్నారు. దీంతో రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. యువత సంఖ్య తగ్గిపోతోంది. అదే సమయంలో ఒకరి మీద ఆధారపడి జీవించేవారు పెరుగుతుండటంతో, రాష్ట్ర జనాభా క్షీణిస్తోంది. 2011లో 7.10 శాతంగా ఉన్న రాష్ట్ర జనాభా వృద్ధిరేటు 2021 నాటికి 3.5 శాతంకు పడిపోయింది. సీఆర్‌ఎస్ రిపోర్టు ప్రకారం ఏపీలో అబ్బాయిల కంటే అమ్మాయిల జననాలు క్రమంగా పెరుగుతున్నాయి. 2017లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 935 మంది అమ్మాయిలు ఉండగా, అది 2022 నాటికి 938గా ఉంది.