
కర్నూలు: కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్యే రాజీనామా చేసిన కర్నూలుకు చెందిన రాజకీయ ప్రముఖుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి త్వరలో సొంతగూడు తెదేపా చేరే అవకాశాలున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఆయన తెదేపాను వీడారు. అనంతరం రాయలసీమ హక్కుల సాధనం ఒక రాజకీయ పక్షాన్ని కూడా ప్రారంభించిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీశైలం విధానసభ సభ్యుడ ప్రస్తుత తెదేపా అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు సోమవారం ప్రకటించారు. దీంతో అక్కడి నుంచి పోటీకి తనకు అవకాశం ఇవ్వాలని బైరెడ్డి తెదేపా అధిష్ఠానాన్ని కోరినట్లు తెలుస్తోంది. తను అక్కడి నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తానని, తెదేపా లోక్సభ అభ్యర్థి గెలుపునకు కూడా లాభిస్తుందని చెప్పినట్లు సమాచారం. అధిష్ఠానంతో సాగుతున్న చర్చలు సఫలమైతే రేపు లేక ఎల్లుండి తెదేపాలో బైరెడ్డి చేరే అవకాశం ఉంది.