హైదరాబాద్: విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ బయోపిక్‌కు తేజ దర్శకత్వంలో శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. ఈ బయోపిక్‌ను తీయగలననే పూర్తి నమ్మకం లేక తప్పుకున్నట్లు చెప్పారు. బయోపిక్ తొలి భాగం ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై తేజ తాజాగా మాట్లాడారు. బయోపిక్ గురించి స్పందించాల్సిందిగా మీడియా ప్రశ్నించగా.. ‘నా తర్వాతి సినిమాతో చాలా బిజీగా ఉన్నాను. నాకు ఎన్టీఆర్ బయోపిక్ చూసే సమయం లేదు. అందుకే నేను స్పందించలేకపోతున్నా. సినిమా చూసుంటే కచ్చితంగా మాట్లాడేవాడ్ని’ అని తేజ అన్నారు. అనంతరం సినిమాలో ఇంకాస్త డ్రామా ఉంటే బాగుండేదా? అని ప్రశ్నించగా.. ‘అది దర్శకుడిపై ఆధారపడుతుంది. ఆయనే తన పనితనాన్ని చూపించాలి’ అని చెప్పారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ బయోపిక్‌ను వారాహి చలన చిత్రం సంస్థ సమర్పిస్తోంది. ఎమ్.ఎమ్. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ బయోపిక్‌ను రెండు భాగాలు చేసిన సంగతి తెలిసిందే. ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ జనవరి 9న విడుదలై, మంచి టాక్ అందుకుంది. ‘యన్.టి.ఆర్-మహానాయకుడు’ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బయోపిక్‌లో బసవతారకంగా విద్యా బాలన్, నారా చంద్రబాబు నాయుడుగా రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, హరికృష్ణగా కల్యాణ్‌రామ్, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్ సింగ్, రేలంగిగా బ్రహ్మానందం, నాగిరెడ్డిగా ప్రకాశ్‌రాజ్, షావుకారు జానకిగా షాలినీ పాండే, సావిత్రిగా నిత్యా మేనన్ నటించారు.