న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యలో ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను సవరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ అంశంపై సుప్రీంకోర్టులోనూ కేసు విచారణ కొనసాగుతున్నది. అయితే ఈ నేపథ్యంలో.. ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక చర్చ చేపట్టాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్షాలు లేఖ రాశాయి. అనేక మంది విపక్ష ఎంపీలు ఆ లేఖపై సంతకం చేశారు. ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చ చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతోందని, కానీ ఇప్పటి వరకు ఓటర్ల జాబితా అంశంపై చర్చించేందుకు తేదీని ప్రకటించలేదని విపక్షాలు ఆ లేఖలో పేర్కొన్నాయి. ఓటర్ల జాబితా సవరణ వల్ల.. ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రత్యేక చర్చ చేపట్టడం వల్ల ఆ అంశంపై సభ్యులకు క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పారదర్శకత, బాధ్యత అవసరమన్నారు.