బీహార్‌ ఎస్‌ఐఆర్‌ పిటిషన్‌లపై జులై 10న విచారణ

బీహార్‌ ఎస్‌ఐఆర్‌ పిటిషన్‌లపై జులై 10న విచారణ

న్యూఢిల్లీ :   బీహార్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం అత్యవసర విచారణకు జాబితా చేసింది. ఈ మేరకు జస్టిస్‌ సుధాంషు ధులియా, జస్టిస్‌ జోయ్మాల్యా బాగ్చిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) మరియు విచారణకు హాజరైన ఇతర ప్రతివాదులకు తమ పిటిషన్ల కాపీలను ముందుగానే అందజేయాలని కోర్టు ఆదేశించింది. పిటిషన్ల కాపీలను భారత అటార్నీ జనరల్‌కు కూడా అందజేయాలని కోరింది. ఎస్‌ఐఆర్‌లో భాగంగా 1987 తర్వాత జన్మించిన వారు తమ జనన ధ్రువీకరణ, శాశ్వత నివాస పత్రాలు, అలాగే వారి తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలు సహా మొత్తం 11పత్రాలను సమర్పించాలని ఎన్నికల కమిషన్‌ (ఇసి) ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఈ ఆదేశాలపై బీహార్‌లోని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇసి ఆదేశాలను సవాలు చేస్తూ సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, ఎ.ఎం.సింఘ్వీ, గోపాల్‌ శంకర్‌ నారాయణన్‌, షాదన్‌ ఫరాసత్‌లు, పిటిషనర్లు ఆర్‌జెడి ఎంపి మనోజ్‌ఝా, టిఎంసి ఎంపి మహువా మొయిత్రా, ఎడిఆర్‌ కార్యకర్త యోగేంద్ర యాదవ్‌లు పిటిషన్లు దాఖలు చేశారు. జూన్‌ 24 నాటి ఎస్‌ఐఆర్‌ నోటిఫికేషన్‌ బీహార్‌లోని కోట్లాది మంది పేద, అణగారిన వర్గాలకు చెందిన ఓటర్లను తమ నివాసాన్ని ధ్రువీకరించేలా ఆధార్‌, రేషన్‌ కార్డులు కాకుండా ఇతర పత్రాలను సమర్పించాలని కఠిన నిబంధనలు విధించిందని సీనియర్‌ న్యాయవాది సింఘ్వీ వాదించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos