వీఐపీ పార్టీ చీఫ్ తండ్రి హ‌త్య

వీఐపీ పార్టీ చీఫ్ తండ్రి హ‌త్య

పాట్నా: బీహార్కు చెందిన వికాశ్షీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) చీఫ్ ముకేశ్ సహని తండ్రిని దారుణంగా హత్య చేశారు. జితన్ సహని శరీరాన్ని ముక్కలుగా నరికారు. దర్బాంగ జిల్లాలోని ఆయన స్వంత ఇంట్లో హతమార్చారు. సీనియర్ పోలీసు అధికారి జగన్నాథ్ రెడ్డీ ఈ మర్డర్ను ద్రువీకరించారు. జితన్ సహని హత్యతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. బీహార్ సర్కార్లో ముకేశ్ సహనీ మాజీ మంత్రిగా చేశారు. ఓబీసీ వర్గ ప్రజల్లో వీఐపీ పార్టీకి మంచి పట్టు ఉన్నది. ఆ పార్టీ తాజా ఎన్నికల్లో ఇండియా కూటమికి సపోర్టు ఇచ్చింది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో వీఐపీ మద్దతుగా నిలిచింది. కొందరు వ్యక్తులు దొంగతనం కోసం జితన్ సహని ఇంట్లోకి ప్రవేశించారని, కానీ వాళ్లను అతను అడ్డుకోవడంతో హత్య చేసి ఉంటారని పోలీసు అధికారి మనిశ్ చంద్ర చౌదరీ వెల్లడించారు.మర్డర్ను దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను రూపొందించినట్లు సీనియర్ ఆఫీసర్ రెడ్డి తెలిపారు. జితన్ సహని మర్డర్ జరగడాన్ని తప్పుపడుతూ.. నితీశ్ ప్రభుత్వాన్ని ఆర్జేడీ విమర్శించింది. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని షాక్లోకి నెట్టివేసిందని ప్రతినిధి శక్తి యాదవ్ తెలిపారు. బీహార్లో ఏం జరుగుతోందని, మర్డర్ జరగకుండా ఒక్క రోజు కూడా గడవడం లేదని, మతిలేని ప్రభుత్వం అధికారంలో ఉన్నదని, వ్యవస్థ కుప్పకూలిందని ఆయన ఆరోపించారు.హత్య ఘటన జరగడం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం, బీజేపీ సమ్రాట్ చౌదరీ తెలిపారు. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరపున ఆయన హామీ ఇచ్చారు. ముకేశ్ సహని ఫ్యామిలీకి అండగా ప్రభుత్వం ఉందన్నారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆ మర్డర్ను ఖండించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos