బాహుబలి అనంతరం దక్షిణాది చిత్రాలు ముఖ్యంగా తెలుగు చిత్రాలకు బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.రీమేక్‌ల కోసం అనువాద హక్కుల కోసం పెద్ద సంస్థల నుంచి చిన్న సంస్థలు వరకు అన్ని తమస్థాయికి తగ్గ చిత్రాలను ఏదోఒక రూపంలో దక్కించుకోవడానికి పోటీ పడుతున్నాయి.ఇక పలు హిట్ చిత్రాలను అనువదించి యూట్యూబ్‌లో విడుదల చేసే గోల్డ్‌మైన్ సంస్థ ప్రతినిధులు తెలుగులో విడుదలయ్యే కొత్త చిత్రాల అనువాదం కోసం ఎప్పటికప్పుడు హైదరాబాద్‌కు వస్తుంటారు.ఇక దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత భారీ బడ్జెట్‌తో భారీ మల్టీస్టారర్‌తో తెరకెక్కించనున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంపై దేశవ్యాప్తంగా ఆకాశాన్నంటే క్రేజ్ నెలకొని ఉంది.రాజమౌళి మీడియా సమావేశం పెట్టి మరీ చిత్రంలో నటీనటులు,కథ,పాత్రల తీరుతెన్నుల గురించి వివరించాక అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో హిందీ అనువాద హక్కులను సొంతం చేసుకోవడానికి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి.బాహుబలి చిత్రం హిందీ అనువాద హక్కులను దక్కించుకున్న దర్శక నిర్మాత కరణ్ జొహార్ మరోసారి జక్కన్న స్నేహంతో ఆర్‌ఆర్‌ఆర్ హక్కులు కూడా దక్కించుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.అయితే అనూహ్యంగా రిలయన్స్ సంస్థ రంగంలోకి దిగడంతో ఆర్‌ఆర్‌ఆర్ అనువాద హక్కులు మరోస్థాయికి వెళ్లాయి.రిలయన్స్ సంస్థ డబ్బు విషయంలో వెనక్కు తగ్గే అవకాశమే లేకపోవడంతో ఆర్‌ఆర్‌ఆర్ హిందీ హక్కులపై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది..