అమరావతి:సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో వైఎస్సార్సీపీ నేత సజ్జల భార్గవ్‌రెడ్డి పోలీస్ విచారణ ముగిసింది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై సజ్జల భార్గవరెడ్డి, వైఎస్సార్సీపీ నేత పర్వతం సుధాకర్ రెడ్డిలు సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారంపై ఐటీడీపీ నేత గతేడాది నవంబరులో తమకు ఫిర్యాదు చేశారని మంగళగిరి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు చెప్పారు.ఈ మేరకు విచారణకు రావాలని మంగళగిరి పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. నేడు(బుధవారం) ఉదయం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ల్లో సజ్జల భార్గవ్ రెడ్డి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు సజ్జల భార్గవరెడ్డిని పోలీసులు విచారించారు. దాదాపు 22 ప్రశ్నలు సంధించారు. అన్ని ప్రశ్నలకు దాటవేత సమాధానం ఇచ్చినట్లు సమాచారం. సజ్జల సమాధానాలతో సంతృప్తి చెందని అధికారులు మరోసారి ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉందని చెప్పారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. సజ్జల భార్గవ్ రెడ్డి, పర్వతం సుధాకర్ రెడ్డిలు కొంతమంది నకిలీ అకౌంట్ల ద్వారా పోస్టులు పెట్టించినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ పోస్టులను స్థానిక వైఎస్సార్సీపీ నేతలు తమ అనుచరుల ద్వారా పెట్టించినట్లు విచారణలో సజ్జల వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. సజ్జల భార్గవరెడ్డి, పర్వతం సుధాకర్ రెడ్డిపై 509, 353, క్లాజ్ 2, 61 క్లాజ్2, 111 క్లాజ్1, 79 BNS కింద కేసులు నమోదు చేశారు.