కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) రద్దు చేస్తూ తీసుకొచ్చిన తీర్మానానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీంతో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం తీసుకొచ్చిన నాలుగో రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై సీఎం మమతా బెనర్జీ మాట్లాడారు. దేశ ప్రజలను విడదీసేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడగలిగే ధైర్యం తనకు ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ధీటైన సమాధానం ఇచ్చారు. బెంగాల్ అసెంబ్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మంత్రి పార్ధ ఛటర్జీ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మమతా మాట్లాడుతూ సీఏఏ కారణంగా దేశమంతా ఆందోళనకర వాతావరణం ఏర్పడిందన్నారు. దేశాన్ని విభజించేందుకు లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ చట్టానికి ఎంతమాత్రం మద్దతిచ్చేది లేదని ఆమె స్పష్టం చేశారు. ‘బెంగాల్‌లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లోను అమలు చేసేది లేదు. వీటి వల్ల తాము దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు’ అని ఆమె అన్నారు. దేశాన్ని కాపాడుకునేందుకు పార్టీల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. సీఏఏను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సీఏఏను తీసుకొచ్చిన నాటి నుంచి ఆమె దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఇటీవల ప్రధాని మోదీని కలిసినప్పుడు ఆమె కోరారు. సీఏఏకు వ్యతిరేకంగా సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలోనే పలుమార్లు ర్యాలీలు నిర్వహించారు. పంజాబ్, కేరళ, రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీలు ఇటీవలే సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేశాయి.