బెల్ట్ షాపులు పూర్తిగా అరికట్టాలి

బెల్ట్ షాపులు పూర్తిగా అరికట్టాలి

మచిలీ పట్నం : కల్లుగీత కార్మికుల జీవనోపాధిపై దెబ్బ కొడుతున్న బెల్టు షాపులను పూర్తి అరికట్టాలని కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాకా రామచంద్రరావు డిమాండ్ చేశారు. గురువారం మచిలీపట్నం బలరాముని పేటలో జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వద్ద కల్లుగీత కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా ఉద్దేశించి వాకా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా 50 ఏళ్ళు నిండిన ప్రతి గీత కార్మికులకు పెన్షన్ సత్వరమే మంజూరు చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా వేల మంది గీత కార్మికులు పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. తాటి చెట్ల పై కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయిన గీత కార్మికులకు 10 లక్షలు, పూర్తి అంగవైకల్యం పొందిన వారికి ఐదు లక్షలు, తాత్కాలిక అంగవైకల్యం పొందిన వారికి లక్ష రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలన్నారు. ఎక్సైజ్ శాఖలో అవినీతిని అరికట్టి దరఖాస్తు చేసుకున్న గీత కార్మికులకు గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలని పేర్కొన్నారు. నూతనంగా దరఖాస్తు చేసుకున్న టిటిసిఎస్, టి ఎఫ్ టి లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో కల్లుగీత కార్మికులకు లభిస్తున్న సంక్షేమ పథకాలు అధ్యయనం చేసి, మన రాష్ట్రంలో కల్లుగీత వృత్తికి రక్షణ ఉపాధి మార్కెట్ సౌకర్యం కల్పించాలని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సొసైటీ అధ్యక్షులు ముక్తకంఠంతో కోరారు. కరగ్రహారం సొసైటీ అధ్యక్షుడు పరస శీను గీత కార్మికుల సంఘం నాయకులు బోర్ర రాము, ఘంటసాల మండలం నుంచి పామర్తి వెంకటేశ్వరరావు, పామర్రు మండలం నుంచి కొనకళ్ళ వెంకటరావు తదితరులు జిల్లా ఎక్సైజ్ కార్యాలయం పర్యవేక్షణ అధికారి జి గంగాధరరావుకు వినతిపత్రం సమర్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos