కొచ్చి: ఇక్కడికెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో చోటు చేసుకున్న ఒక ఘటన ఆ బ్యాంక్ ఉద్యోగుల నిరసనకు దారితీసింది. బీహార్‌కు చెందిన బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగులు బీఫ్ తినడంపై నిషేధం విధించగా.. ఈ నిర్ణయంపై ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. బీహార్ నుంచి కేరళకు బదిలీ అయిన రిజినల్ మేనేజర్ ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన బ్యాంకు క్యాంటీన్‌లో బీఫ్ (గొడ్డు మాంసం) వడ్డించరాదని ఆదేశించినట్లు సమాచారం. అయితే మేనేజర్ ఇచ్చిన ఆదేశాల పట్ల ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు.మేనేజర్‌పై నిరసన తెలుపుతూ.. బ్యాంక్ ఆఫీసు బయట బీఫ్, పరోటాలతో విందు ఏర్పాటు చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగగా.. ప్రతి పౌరుడికి రాజ్యాంగం ప్రకారం నచ్చిన ఆహారం తినే హక్కు ఉందని, ఈ హక్కును ఎవరూ ఉల్లంఘించలేరని ఉద్యోగులు తెలిపారు. బ్యాంక్ ఉద్యోగులు చేసిన ఈ నిరసన పట్ల రాజకీయ నాయకులతో పాటు పలు సంఘలు తమ మద్దతును తెలిపాయి.