ప్రయాగ్‌రాజ్ : బాబా అంటేనే అతన్ని అందరూ పవిత్రంగా చూస్తారు. ప్రతి రోజు సూర్యోదయానికి ముందే స్నానమాచరించి.. పూజా కార్యక్రమాల్లో నిమగ్నమవుతుంటారు. ఇక బాబాల ఆశీర్వాదం కోసం భక్తులు బారులు తీరుతుంటారు. కానీ ఓ బాబా మాత్రం గత 32 ఏండ్లుగా స్నానం ఆచరించడం లేదు. కానీ మిగతా కార్యక్రమాలన్నీ క్రమం తప్పకుండా చేస్తున్నారు. మరి 32 ఏండ్లుగా స్నానం ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తే.. తన కోరికలు నెరవేరనందుకు అని చెప్పి.. అందర్నీ షాకింగ్‌కు గురి చేస్తున్నారు. మరి ఆ బాబా ఎవరో తెలుసుకోవాలంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిందే. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా నదిలో జనవరి 13వ తేదీ నుంచి మహాకుంభ మేళా ప్రారంభం కానుంది. ఈ మహా కుంభ మేళాలో పాల్గొనేందుకు అసోంలోని కామాఖ్యా పీఠం నుంచి గంగాపురి మహారాజ్ అనే బాబా ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. ఛోటూ బాబాగా ప్రసిద్ధి గాంచిన ఆయన ఇప్పుడు అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఛోటూ బాబా మాట్లాడుతూ.. నా ఎత్తు కేవలం 3 ఫీట్ల 8 ఇంచులు మాత్రమే. వయసు 57 సంవత్సరాలు. మహా కుంభమేళాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలు కూడా ఈ మహా కుంభ మేళాలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది. అయితే నేను గత 32 ఏండ్లుగా స్నానం చేయడం లేదు. ఎందుకంటే.. నేను కోరుకున్న కోరికలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు ఫలించలేదు. అందుకే ఈ సారి కూడా గంగాలో పుణ్య స్నానం ఆచరించను అని ఛోటూ బాబా చెప్పుకొచ్చారు.