విజయవాడ : పైనుండి చేరుతోన్న వరద నీటి కారణంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.25 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇది 5 లక్షల క్యూసెక్కులు వరకు చేరవచ్చని అధికారులు భావిస్తున్నారు.మంగళవారం మధ్యాహ్నంలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉండడంతో.. ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ” కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాగులు.. కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దు ” అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో ప్రజలను హెచ్చరించారు. వాయుగుండం ప్రభావంతో గడచిన 24 గంటల్లో.. పాడేరులో 16 సెంమీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రమంతటా ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు, అలాగే కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతాయని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం మంగళవారం మధ్యాహ్ననికి దక్షిణ ఒడిశా వద్ద తీరం దాటనుంది. ఈ క్రమంలో.. గడిచిన 24 గంటల్లో ఎపిలో కుండపోత వానలు కురిశాయి. నిన్న రాత్రి నుంచి వానలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఈరోజు అక్కడక్కడ భారీ వానలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.