రోజుకో మలుపు తీసుకుంటూ ఊహించని నాటకీయ పరిణామాలతో గతనెలలో కర్ణాటక రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో అధికారంలోకి వచ్చిన యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త నిర్ణయాలతో దూసుకెళుతోంది.ఈ క్రమంలో గతంలో అధికారంలో ఉన్న సమయంలో రూపొందించిన గోహత్య నిషేధం బిల్లును అమలు చేయడానికి పావులు కదుపుతోంది.గత నెల 26వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2010 నాటి గోహత్య నిషేధం బిల్లును తిరిగి ప్రవేశపెట్టాలని పార్టీ నాయకులు యడియూరప్పపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర మంత్రి సీటీ రవి గోహత్య నిషేధం బిల్లుపై స్పందించారు. వివిధ రాష్ట్రాల్లో గోవధపై చట్టాలు ఎలా ఉన్నాయో అధ్యయనం చేసేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలోనే బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.2010లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో గోహత్య నిషేధ బిల్లుకు శాసనసభలో ఆమోదం లభించింది.గోవులను అక్రమంగా రవాణా చేస్తే ఏడేళ్లు జైలు శిక్ష విధించబడుతుందని బిల్లులో చేర్చారు.అయితే అప్పటి గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ బిల్లుకు ఆమోదం తెలపకపోవడంతో బిల్లు పెండింగ్లో ఉండిపోయింది. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బిల్లును విత్డ్రా చేయాలని భావించారు. ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రం గోవధ నిషేధం పాక్షికంగా అమలవుతోంది. ఇది 1964వ చట్టాన్ని అనుసరిస్తోంది. పాలు ఇవ్వని గోవులను, వ్యాధితో బాధపడుతున్న గోవులను వధించేందుకు 1964నాటి చట్టం అనుమతిస్తోంది.తాజాగా మరోసారి గోహత్య నిషేధం బిల్లు అమలు చేయాలనే డిమాండ్ తెరపైకి రావడం చర్చనీయాంశమైంది.దీంతోపాటు ఒక దేశం ఒక జెండా విధానాన్ని బీజేపీ విశ్వసిస్తుందని… సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్ణాటక జెండాను తీసుకొచ్చారని దాన్ని వెంటనే రద్దు చేయాలని యడ్యూరప్పను కోరామన్నారు..