న్యూ ఢిల్లీ : మత మార్పిడుల నిషేధ చట్టం పర్యవసానాల్ని జనం ఇప్పుడు అనుభవిస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆక్రోశించారు. గత జూలైలోనే పెళ్లి చేసుకున్న రషీద్ అలీ, పింకి డిసెంబర్ ఐదున తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకునేందుకు రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లినప్పుడు వారిపై బజ్రంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారు. పోలీసులు దాడి చేసిన వారిపై ఎలాంటి చర్య తీసుకోకుండా రషీద్ అలీని అరెస్ట్ చేసి జైలుకు, పింకీని షెల్టర్ హోమ్కు పంపించారు. దాడిలో గాయపడిన పింకీకి గర్భస్రావం అయింది. ‘నేను మేజర్ను నాకు 22 ఏళ్లు. నేను ఇష్టపూర్వకంగానే ప్రేమించి పెళ్లి చేసు కున్నాను. గత జూలై 24వ తేదీన మేము పెళ్లి చేసుకున్నాము. పెళ్లై అయిదో నెల నడుస్తోంది. దయచేసి మమ్మల్ని వదిలి పెట్టండి’ అంటూ పింకీ ప్రాధేయ పడినా బజరంగ్ దళ్ కార్యకర్తలుగానీ, పోలీసులు వినిపించుకోలేదన్న వీడియోను సామాజిక కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కించారు.‘దేశంలో ఎప్పటి నుంచో దళితులు, వెనకబడిన వర్గాల మత మార్పిడులు కొనసాగుతున్నాయి. సమాజం దళితులను చిన్న చూపు చూస్తున్నందుకు నిరసనగా సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 1956లో ఒక దళిత బృందంతో కలసి బౌద్ధం మతంలోకి మారారు. తమిళ నాడులో మారవ సామాజిక వర్గ భూస్వాముల అణచివేతకు నిరసనగా 1981లో మీనాక్షిపురంలో వెయ్యి మంది దళితులు ఇస్లాం లోకి మారారు. 2002లో హర్యానాలోని జాజ్జర్లో చనిపోయిన ఆవును దాచారనే ఆరోపణపై ఐదుగురు దళితులపై జరిగిన దాడికి నిరసనగా వందలాది దళి తులు బౌద్ధ మతంలోకి మారారు. గత అక్టోబర్లో ఉత్తరప్రదేశ్, హథ్రాస్లో వాల్మీకి కులానికి చెందిన దళిత యువతిపై అగ్రవర్ణ యువకులు నలుగురు హత్యా చారాన్ని చేసారు. దీనికి నిరసనగా వాల్మీకి కులానికి చెందిన 200 మంది బౌద్ధంలోకి మారారు. కొత్త చట్టం వల్ల ఇలాంటి మత మార్పిడులన్నీ చట్ట విరుద్ధం అవుతాయని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం వల్ల ఓ మనిషి ప్రాణం పోవడానికి కారణమైతే చట్ట ప్రకారం గరిష్టంగా రెండే ళ్లు జైలు శిక్ష పడుతుందని, అదే మతం మారితే పదేళ్లు జైలు శిక్ష వేయడం ఏమేరకు సముచితమని వారు ప్రశ్నించారు.