విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాని పర్యటనను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో నల్లబెలూన్లను ఎగురవేసి కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. విమానాశ్రయం నుంచి ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ టేకాఫ్ అయి గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో నల్లబెలూన్లను గాల్లోకి వదిలారు. కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు, పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను నిరసిస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నల్ల బెలూన్లతో నిరసన తెలిపేందుకు భీమవరం బయల్దేరిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు.