నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి నిర్వహించే ఎన్నికలో బ్యాలెట్ పేపర్‌ను మాత్రమే వినియోగించాలని పసుపు రైతులు డిమాండ్ చేశారు. నామినేషన్లు వేసిన పసుపు రైతులంతా దీనిపై జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో సోమవారం సమాజవేశమయ్యారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదని వారు తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలకు ఓటు వేయకుండా రైతులకే ఓటు వేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. రైతులను గెలిపిస్తే, వారి గళాన్ని లోక్‌సభలో వినిపించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఏళ్ల తరబడి రైతుల సమస్యలను ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు, ఎర్రజొన్న రైతులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశారు. వీరిలో 185 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. ఒక ఈవీఎంపై 16 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే ముద్రించే అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని తొలుత ఎన్నికల అధికారులు అనుకున్నారు. తాజాగా ఈవీఎంలతోనే ఎన్నిక జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది.