
తన తండ్రి పాత్రలో
తన స్వయంగా నటించాలనే కోరికతో ఎన్‌బీకే ఫిల్మ్స్ పేరుతో తనే ఒక సొంత నిర్మాణ సంస్థ
ఏర్పాటు చేసి తన తండ్రి సినిమా,రాజకీయ ప్రస్థానంపై ఎన్టీఆర్ కథనాయకుడు,ఎన్టీఆర్ మహానాయకుడు
పేర్లతో రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించి విడుదల చేసారు నందమూరి బాలకృష్ణ.ఈ
ఒక్క సినిమాతో బాలకృష్ణ తన రెండు కోరికలు నెరవేర్చుకున్నారు.అందులో మొదటిది ఎన్నో ఏళ్లుగా
సొంత ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేయడం రెండవది తన తండ్రి బయోపిక్‌లో తనే స్వయంగా నటించడం.అయితే
రెండు కోరికలు మాత్రం బాలయ్యను తీవ్రంగా నిరాశపరిచాయి.రెండు భాగాలు విడుదల చేసిన బయోపిక్
బాలకృష్ణ సినీకెరీర్‌లో అత్యంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకోగా సొంతంగా ఏర్పాటు చేసిన
నిర్మాణ సంస్థలో నిర్మించిన మొదటి చిత్రం అందులోనూ తన తండ్రి బయోపిక్ ఘోరంగా విఫలమవడం
బాలకృష్ణతో పాటు నందమూరి అభిమానులకు కూడా రుచించడం లేదు.మొదటి భాగం కొన్న డిస్ట్రిబ్యూటర్లు
రూ.50కోట్లు నష్టపోవడంతో రెండవ భాగాన్ని ఎటువంటి అడ్వాన్స్‌లు తీసుకోకుండా వచ్చే వసూళ్లల్లో
డిస్ట్రిబ్యూటర్లకు 40,నిర్మాతకు 60శాతం చొప్పున వాటాలు ఇచ్చారు.అయితే రెండవ భాగం కూడా
అంతేస్థాయిలో పరాజయం కావడంతో డిస్ట్రిబ్యూటర్లకు ఒరిగిన ప్రయోజనం శూన్యం.గతనెల 22వ
తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రెండవ భాగం మహానాయకుడు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా
రూ.5 కోట్ల షేర్ కూడా సాధించలేక చతికిలపడింది.ఈ ఫలితాలు బాలయ్యను తీవ్ర నిరాశకు గురి
చేసాయి.ఈ పరిణామాలతో ఎన్‌బీకే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ కార్యకలాపాలను నిలిపివేయడానికి
బాలకృష్ణ నిర్ణయించుకున్నట్లు సమాచారం.సమీప భవిష్యత్తులో ఎన్‌బీకే సంస్థ నుంచి ఎటువంటి
సినిమాలు విడుదల కావని సినీవర్గాలు తెలుపుతున్నాయి.దీంతో ఎన్‌బీకే సంస్థలో బోయపాటి
దర్శకత్వంలో తనే హీరోగా స్వయంగా నిర్మించతలపెట్టిన చిత్రాన్ని నిలిపివేయడానికి నిర్ణయించుకున్నారని
సమాచారం.దీంతో బోయపాటి మరో నిర్మాతను వెతుక్కోవాల్సి వస్తోందని సమాచారం.వినయవిధేయ రామ
విడుదల అనంతరం జరిగిన పరిణామాలతో బోయపాటికి ఎవరు అవకాశం ఇస్తారో చూడాలి..