హొసూరు : ఇక్కడికి సమీపంలో అడవి నుంచి గ్రామాల్లోకి వచ్చిన పిల్ల ఏనుగు స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. 15 రోజుల క్రితం హొసూరు సమీపంలోని సానమావు అటవీ ప్రాంతానికి వచ్చిన ఏనుగుల మంద నుంచి ఎనిమిది నెలల పిల్ల తప్పించుకొని గ్రామాల వైపు వచ్చింది. వచ్చీ రావడంతోటే ద్విచక్ర వాహనాలు, కార్లను ధ్వంసం చేయడమే కాకుండా స్థానికులకు ముచ్చెమటలు పట్టించింది. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి మత్తు మందు ఇచ్చి దానిని తల్లి వద్దకు చేర్చారు. సోమవారం ఉదయం పిల్ల ఏనుగు మళ్లీ గ్రామాలకు అతి చేరువలో ప్రత్యక్షమైంది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది స్థానికుల సాయంతో మళ్లీ దానిని అటవీ ప్రాంతానికి తరిమివేశారు. తల్లి నుంచి విడిపోయి గ్రామ ప్రాంతాలలో సంచరిస్తున్న ఈ పిల్ల ఏనుగును వేరే ప్రాంతానికి తరలించాలని అటవీ ప్రాంత గ్రామాలకు చెందిన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.