హొసూరు : ఇక్కడికి సమీపంలో తాతతో కలిసి ద్విచక్ర వాహనంపై పాఠశాలకు వెళుతుండగా టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. కారుపల్లికి చెందిన బసప్ప సోమవారం ఉదయం తన మనవరాళ్లు వినుత, సౌందర్యలను ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని వెళుతుండగా గ్రామ సమీపంలో టిప్పర్ అదుపుతప్పి ఢీకొంది. ఈ సంఘటనలో బసప్పతో పాటు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వినుత సంఘటనా స్థలంలోనే మృతి చెందగా సౌందర్య, బసప్పలను స్థానికులు హొసూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతి వేగంగా వచ్చిన టిప్పర్ అదుపుతప్పి ద్విచక్రవాహనంపై దూసుకెళ్లింది. టిప్పర్‌ల వల్ల ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అతి వేగమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శవ పరీక్ష కోసం చిన్నారి మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.