పట్నా:కూటి కోసం పట్నం వచ్చిన పేదల్ని కరోనా కంటే తీవ్రంగా ఆకలి కాటేస్తోంది. రోజుల తరబడి ఆకలి దప్పికలకు తాళలేక ఒక వలస కార్మికురాలు ప్రాణాలు విడిచింది. ఆమె శాశ్వతంగా నిద్ర పోయిందని తెలియని కొడుకు అమ్మను లేపడానికి ప్రయత్నించాడు. గుండెల్ని పిండేసిన ఈ వీడియో అందరి కంటా తడి పెట్టిస్తోంది. బీహార్కు చెందిన వలస కార్మికురాలు ఉపాధి కోసం వెళ్లిన గుజరాత్ నుంచి శని వారం శ్రామిక్ రైలులో స్వస్థలానికి మళ్లింది. రైలు గమ్యాన్ని చేరుకోకముందే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె మృతదేహాన్ని ముజఫర్నగర్ స్టేషన్ ప్లాట్ఫామ్పై ఉంచారు. ఆమె కుమారుడికి తల్లి మరణించిందనే నిజాన్ని తెలుసుకునే వయస్సు కాదు. దీంతో ఆమెను పడుకుందని భావించి లేపేందుకు ప్రయత్నించాడు. ఆమె ఒంటిపై కప్పిన దుప్పటినీ లాగుతూ తల్లిని లేవమని చెప్పకనే వేడుకున్నాడు. ఈ హృదయ విదారక దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియయాలో చక్కర్లు కొడుతోంది. తిండీ, నీళ్లు లేకే రైలులో అనారోగ్యానికి గురైందని ఆమె బంధువులు పేర్కొన్నారు.