ర్యాపిడో ఫౌండర్‌కు నేనే స్ఫూర్తి’

ర్యాపిడో ఫౌండర్‌కు నేనే స్ఫూర్తి’

హైదరాబాద్‌ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోషల్‌మీడియాలో మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. ప్రముఖ ట్యాక్సీ యాప్‌ ర్యాపిడో ఆవిష్కరణకు తానే స్ఫూర్తిగా నిలిచానంటూ స్వీయకితాబు ఇచ్చుకోవడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అంతేకాకుండా ర్యాపిడో వ్యవస్థాపకుల్లో ఒకరైన నిజామాబాద్‌కు చెందిన పవన్‌ను కూడా గుంటూరు జిల్లావాసి అని చెప్పేందుకు ఆపసోపాలు పడడంపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే శుక్రవారం గుంటూరులోని ఆర్వీఆర్‌ జేసీ ఇంజినీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన ఏఐ ఫర్‌ ఏపీ పోలీస్‌-హ్యాకథాన్‌-2025లో పాల్గొన్న చంద్రబాబు తనదైనశైలిలో మాట్లాడుతూ ‘ఈ రోజు ర్యాపిడో ఉంది. మీరు చూశారు. ఆ ర్యాపిడో వ్యవస్థాపకులు ఇక్కడ ఈ జిల్లా అతనే. అతను… వాళ్ల తండ్రి నిజామాబాద్‌కు మైగ్రేట్‌ అయ్యారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు. నేను చెప్పిన విషయాలన్నీ వినేవాడు. కొడుకు ఐఐటీ చేశాడు. అవన్నీ విన్న తర్వాత వెరీ సింపుల్‌ సొల్యూషన్‌ మీరు చూశారు. అతను చేసిన పని మీరు చూస్తే.. దేశంలో ఉండే ఆటోలుగానీ మోటర్‌ బైక్‌లు గానీ, ఇవన్నీ ఊబరైజేషన్‌ ద్వారా ప్రయాణ సౌకర్యం చేసి, ఒక ప్లాట్‌ఫాం కిందకు తీసుకొచ్చాడు. ఐడియా గ్రేట్‌ కాదు. ఆలోచించిన విధానం గ్రేట్‌’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. చంద్రబాబు గతంలోనూ పలు సందర్భాల్లో చేసిన కామెంట్స్‌ను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్న పవన్‌ అనే వ్యక్తికి తానే స్ఫూర్తి అని చెప్పుకోవడం విడ్డూరమని కొందరు మండిపడుతున్నారు. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ ఏర్పాటుకు ఆద్యుడిని తానేనని పలు వేదికలపై చంద్రబాబు చెప్పుకున్నారని పలువురు గుర్తుచేస్తున్నారు. ప్రపంచంలో ఐటీని ప్రమోట్‌ చేసిన ఘతన కూడా తనకే దక్కుతుందనే స్థాయికి బాబు ఆలోచన వైఖరి చేరుకుందని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా సత్యనాదెళ్ల నియామకమైనప్పుడు కూడా ఆ ఘనతను చంద్రబాబు ఆపాదించుకున్న సందర్భాన్ని నెటిజన్లు ఉదహరిస్తున్నారు. అందుకు మరికొందరు రిైప్లె ఇస్తూ పీవీ సింధు ఒలింపిక్‌ మెడల్‌ సాధించినప్పుడు ఆ ఘనతను, కరోనాకు జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సిన్‌ కనిపెట్టినప్పుడు.. శాస్త్రవేత్తల కృషిని తన గొప్పదనం, ప్రోత్సాహం ఫలితంగా చెప్పుకున్న తీరును చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలోనూ చంద్రబాబు వింతగా మాట్లాడారని, ఇది ఆయన మానసికస్థితిపైనే అనుమానాలను రేకెత్తిస్తున్నదని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. యోగాకు మార్కెట్‌ చాలా వీక్‌గా ఉందని, అందుకే తాను ముందుకు తీసుకెళ్తున్నానంటూ అతిశయోక్తులు మాట్లాడడం విడ్డూరమని మండిపడుతున్నారు. మొత్తానికి చంద్రబాబు ర్యాపిడో కామెంట్లపై సోషల్‌మీడియాలో విపరీతంగా సెటైర్లు పేలుతున్నాయి. బాబు ఇంతకుమించిన వింత కామెంటు చేయరనుకున్న ప్రతీసారి ఆయన అందరి అంచనాలను తారుమారు చేస్తూ మరింత లోతుకువెళ్లి కామెంట్లు చేస్తున్నారని కొందరు ఎద్దేవా చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos