కోల్‌కతా: భాజపా అన్ని విపక్ష పార్టీలను నాశనం చేయాలని చూస్తోందని ఏపీ సీఎం, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్షకు మద్దతు తెలిపేందుకు చంద్రబాబు కోల్‌కతా వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాల్లో అభివృద్ధిని అడ్డుకోవాలని కేంద్రం చూస్తోంది. ఏపీ, పశ్చిమ బెంగాల్, దిల్లీ రాష్ట్రాల అభివృద్ధిని మోదీ సర్కారు అడ్డుకుంటోంది. రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. కేంద్రంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ఎన్డీఏ ప్రభుత్వ చర్యల వల్ల దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతోంది’ అని మండిపడ్డారు. ‘దేశ భవిష్యత్ కోసమే 23 పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను విపక్ష నేతలు కలిశారు. పోలైన ఓట్లలో వీవీ ప్యాట్ చిట్టీలు 50శాతం లెక్కించాలని కోరాం. ఇకపై ఏ నిర్ణయమైనా ఐక్యంగా తీసుకుంటాం. ’ అని చంద్రబాబు అన్నారు.